Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అనుమతులు నాలుగు అంతస్తులకు.. నిర్మాణం ఆరు అంతస్తులకు!

Author
Posted By DIKSOOCHI MEDIA
| 09 Oct 2026, 06:23 AM | TELANGANA
అనుమతులు నాలుగు అంతస్తులకు.. నిర్మాణం ఆరు అంతస్తులకు!

  • శాంతినగర్ ప్రధాన రహదారిపైనే నిబంధనలకు తూట్లు.. టౌన్‌ప్లానింగ్ అధికారుల మౌనం ఎందుకు?
  • అనుమతులకు మించి నిర్మాణం జరుగుతున్నా చర్యలేవీ? ఉన్నతాధికారులు స్పందించేదెప్పుడు?

శాంతినగర్ ప్రధాన రహదారిపైనే నిబంధనలకు తూట్లు.. టౌన్‌ప్లానింగ్ అధికారుల మౌనం ఎందుకు?
అనుమతులకు మించి నిర్మాణం జరుగుతున్నా చర్యలేవీ? ఉన్నతాధికారులు స్పందించేదెప్పుడు?
సికింద్రాబాద్ జోన్, నేటి ప్రభాత సూర్య ప్రతినిధి:
నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే మౌనం వహిస్తున్నారా? అన్న ప్రశ్నలు మెట్టుగూడ సర్కిల్ పరిధిలోని శాంతినగర్ ప్రధాన రహదారిపై జరుగుతున్న భవన నిర్మాణాన్ని చూస్తే తలెత్తుతున్నాయి. నాలుగు అంతస్తులకు అనుమతులు తీసుకొని ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా, సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నది స్పష్టతకు నోచుకోవడం లేదు.
శాంతినగర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న 12-7-690, 691, 695/A చిరునామాల్లో చేపట్టిన భవన నిర్మాణానికి నాలుగు అంతస్తుల వరకు అనుమతులు పొందినట్లు సమాచారం. అయితే, అనుమతులకు భిన్నంగా మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాన రహదారిపై ఇంత పెద్ద నిర్మాణం జరుగుతున్నప్పటికీ అధికారులు గుర్తించలేదా? గుర్తించినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నతాధికారుల హెచ్చరికలు క్షేత్రస్థాయిలో అమలయ్యేనా?
ఇటీవల అంజయ్యనగర్‌లో చోటుచేసుకున్న భవన ప్రమాదం నేపథ్యంలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నారు. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలను ఉల్లంఘించిన నిర్మాణాలపై అధికారులు తక్షణమే స్పందించకపోతే ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతుందనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
నోటీసులు జారీ చేశారా? చర్యలు తీసుకున్నారా?
అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తిస్తే నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత టౌన్‌ప్లానింగ్ అధికారులపై ఉంటుంది. మరి శాంతినగర్‌లోని ఈ భవన నిర్మాణానికి సంబంధించి నోటీసులు జారీ చేశారా? నిర్మాణ అనుమతులను పరిశీలించారా? అదనంగా నిర్మిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు అంతస్తులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అన్న ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.

డిప్యూటీ కమిషనర్ జోక్యం చేసుకుంటారా?
మెట్టుగూడ సర్కిల్ పరిధిలో జరుగుతున్న ఈ నిర్మాణంపై డిప్యూటీ కమిషనర్ దృష్టి సారించి, అనుమతులు–క్షేత్రస్థాయి నిర్మాణాన్ని సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే సంబంధిత నిర్మాణదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తున్న అధికారులు, శాంతినగర్ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి