🏠 diksoochi.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 October 2026, 3:10 pm Posted by : DIKSOOCHI MEDIA

సహారా బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి: బాధితుల డిమాండ్

News Image
మంచిర్యాల జిల్లా |ప్రతినిధి.అక్టోబర్ సెప్టెంబర్ 3 : సహారా ఇండియా సంస్థలో తమ జీవితకాల పొదుపులను డిపాజిట్ చేసి, కాలపరిమితి పూర్తయినా డబ్బులు తిరిగి అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సహారా బాధితులు డిమాండ్ చేశారు. రేపు కరీంనగర్ పర్యటనకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలని కోరుతూ శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సహారా బాధితుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సహారా బాధితుడు, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది సహారా డిపాజిటర్లు తమ కష్టార్జితాన్ని సంస్థలో పెట్టుబడిగా పెట్టారని తెలిపారు. డిపాజిట్ల కాలపరిమితి పూర్తయి మూడు, నాలుగు సంవత్సరాలు గడిచినా తమ సొమ్ము పూర్తిస్థాయిలో తిరిగి అందకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పిల్లల చదువులు, వివాహాలు, సొంతింటి నిర్మాణం వంటి భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు తిరిగి అందకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. బాధితుల డిపాజిట్ సొమ్మును వడ్డీతో సహా త్వరితగతిన చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే సహారా సంస్థలో పనిచేసిన ఏజెంట్లు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, చిరువ్యాపారులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్ము తిరిగి అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర, జిల్లా స్థాయి బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహారా బాధితుల సమస్యను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలని బాధితులు కోరారు. అనంతరం “సహారా బాధితుల ఐక్యత వర్ధిల్లాలి”, “సహారా బాధితులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదుకోవాలి”** అంటూ నినాదాలు చేశారు.

ఈ సమావేశంలో సహారా బాధితులు గజెల్లి వెంకటయ్య, పులి కృష్ణతో పాటు సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు రమేష్, మురహరి, ఆర్. రమేష్ లాల్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home